భూమి…ఇది సృష్టిలో ఎన్నో విలువైన కనిజాల సంపద…భూమి లోపల బంగారం, వజ్రాలు, ఎన్నో ఎన్నెన్నో విలువైన ఖనిజాలు లభిస్తాయి.. భూమిలో విలువైన వజ్రాలు ఏర్పడటానికి చాలా వందల సంవత్సరాలు పడుతుంది.ప్రత్యేక పరిస్థితుల మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి లభ్యమవుతాయి. అందుకే వజ్రాలకు చాలా విలువ..అయితే తాజాగా శాస్త్రవేత్తలు భారీ వజ్రాల పొరను కనుగొన్నారు. ఆది దాదాపు 15కిమీ మేర వ్యాపించిందట..అయితే అది భూమిపై కాదు…బుధగ్రహం అంటే మెర్క్యురీ ఉపరితలంపై…
సూర్యుడికి అతి దగ్గరలో ఉన్న బుధ గ్రహం (Mercury) శాస్త్రవేత్తల కోసం ఎప్పటికప్పుడు కొత్త మిస్టరీలనే విసురుతోంది. తాజాగా జరిగిన ఒక పరిశోధనలో, ఈ చిన్న గ్రహం ఉపరితలానికి కింద లోతైన వజ్రాల పొర ఉండవచ్చుననే సూచనలు లభించాయి.బీజింగ్‌లోని సెంటర్ ఫర్ హై-ప్రెజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ కు చెందిన యాన్హావో లిన్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం Nature Communications జర్నల్‌లో ప్రచురించబడింది.
పరిశోధన ముఖ్యాంశాలు..
మెర్క్యురీ (బుధ గ్రహం) లో అధిక కార్బన్ కంటెంట్ ఉండటం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.గ్రహం యొక్క బలహీనమైన అయస్కాంత క్షేత్రం కూడా ఈ రహస్యాన్ని విప్పడానికి కీలకంగా ఉందని వారు భావిస్తున్నారు.
NASA యొక్క మెసెంజర్ స్పేస్‌క్రాఫ్ట్ గ్రహం ఉపరితలంపై విచిత్రమైన నల్లటి మచ్చలను గుర్తించింది, వీటిని శాస్త్రవేత్తలు గ్రాఫైట్గా నిర్ధారించారు.అధిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల వలన గ్రాఫైట్ వజ్రాలుగా మారే అవకాశాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఎందుకు ఇది ముఖ్యమైంది?
బుధ గ్రహం యొక్క అంతర్గత నిర్మాణం, దాని అసాధారణ అయస్కాంత క్షేత్రం, మరియు అధిక కార్బన్ ఉనికిని అర్థం చేసుకోవడం, మన సౌరవ్యవస్థలో గ్రహాల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగులు పడేలా చేస్తుంది. వజ్రాల పొర ఉనికిని నిర్ధారించగలిగితే, ఇది మనం గ్రహాల గురించి తెలిసిన జ్ఞానానికి విప్లవాత్మకమైన మార్పు అవుతుంది.
చైనా-బెల్జియం శాస్త్రవేత్తల బృందం కార్బన్, సిలికా, ఇనుము మిశ్రమాన్ని తీసుకొని, దానికి ఐరన్ సల్ఫైడ్ కలిపి మెర్క్యురీ ఉపరితల పరిస్థితులను అనుకరించారు.అధిక పీడన యంత్రాన్ని ఉపయోగించి 7 గిగాపాస్కల్స్ ఒత్తిడి, 1,970°C ఉష్ణోగ్రతల వద్ద ప్రయోగాలు చేశారు.అదేవిధంగా కంప్యూటర్ నమూనాలు రూపొందించి, ఇలాంటి పరిస్థితుల్లో గ్రాఫైట్ లేదా డైమండ్ ఏది ఏర్పడుతుందో పరిశీలించారు.
పరిశోధనలో ఆలివిన్ వంటి ఖనిజాలు మెర్క్యురీ మాంటిల్‌లో ఉండవచ్చని తేలింది. అయితే సల్ఫర్ మిశ్రమాలు ఏర్పడే ఉష్ణోగ్రతను పెంచి, గ్రాఫైట్ బదులు వజ్రాలు స్ఫటికీకరించేలా చేశాయి. కంప్యూటర్ మోడల్స్ ప్రకారం ఈ వజ్రాలు కోర్-మాంటిల్ సరిహద్దులో 15 కి.మీ మందపాటి పొరగా నిలిచాయి.కానీ వీటిని తవ్వడం అసాధ్యం ఎందుకంటే ఇవి ఉపరితలం నుండి 485 కి.మీ లోతులో ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వజ్రాలు కోర్ మరియు మాంటిల్ మధ్య ఉష్ణ బదిలీని ప్రభావితం చేసి మెర్క్యురీ యొక్క బలహీన అయస్కాంత క్షేత్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఈ అధ్యయనం ద్వారా కార్బన్-రిచ్ ఎక్సోప్లానెట్లపై కూడా కొత్త అవగాహన వచ్చింది — అక్కడ కూడా ఇలాంటి వజ్రాల పొరలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.2025లో మెర్క్యురీ చుట్టూ తిరగబోయే BepiColombo మిషన్ ఈ సిద్ధాంతాన్ని పరీక్షించే అవకాశం కల్పించనుంది. ఇది గ్రహం అంతర్భాగం గురించి మరిన్ని రహస్యాలను బహిర్గతం చేయబోతోంది.





