దేశంలో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజు కూడా డజన్ల కొద్దీ ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 550కి పైగా ఫ్లైట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోవాల్సి వచ్చింది.
ఇందుకు తోడు, ఇతర పౌర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. చిన్న దూరాలకు కూడా అనూహ్యంగా అధిక ఛార్జీలు వసూలవుతున్నాయి. హైదరాబాద్–ముంబై రూట్లో ఎయిర్ ఇండియా రెండు స్టాప్‌లతో కూడిన ఎకానమీ టికెట్ ధర రూ. 70,329కు చేరగా, హైదరాబాద్–భోపాల్ టికెట్ రూ. 90,000 వరకు ఉన్నట్లు తెలిసింది.ఈ అయోమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అన్ని ఎయిర్‌లైన్స్‌పై కొత్త ఛార్జీల శ్లాబ్‌లను విధిస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నూతన రెగ్యులేషన్లను విడుదల చేసింది. ప్రయాణికుల నుండి ప్రకటించిన రేట్లకు మించి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
ఈ సంక్షోభం పూర్తిగా తగ్గేవరకు ఈ పరిమితులు కొనసాగనున్నాయి.కొత్త ఛార్జీలు ఏ విధమైన బుకింగ్కైనా వర్తిస్తాయి.ఎయిర్‌లైన్ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు అన్నీ దీనిలో భాగమే. అయితే యూజర్ డెవలప్మెంట్ ఫీ, పాసింజర్ సర్వీస్ ఫీ, పన్నులు ఇందులోకి రావు. బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్–ఉడాన్ విమానాలకు ఇవి వర్తించవు.
కేంద్రం విడుదల చేసిన గరిష్ట ఛార్జీల శ్లాబ్‌లు:
500 కి.మీ దూరం వరకు: గరిష్ట ఛార్జీ రూ. 7,500
500–1,000 కి.మీ దూరం: గరిష్ట ఛార్జీ రూ. 12,000
1,000–1,500 కి.మీ దూరం: గరిష్ట ఛార్జీ రూ. 15,000
1,500 కి.మీ పైబడిన దూరం: గరిష్ట ఛార్జీ రూ. 18,000
ఈ రేట్లను మించి ఎయిర్‌లైన్స్ వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది.





