ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంటలో పూత రాలిపోతోంది. ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రంగు మారిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.

తగ్గుతున్న దిగుబడివ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం సాధారణంగా ఒక్క ఎకరానికి 10–12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అయితే నిరంతర వర్షాల కారణంగా వేర్ల ద్వారా పోషకాలు అందకపోవడంతోపాటు పూత రాలిపోవడం, కాత నిలిచిపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
భారీ ఖర్చులు – తక్కువ లాభాలు
ఒక ఎకర పత్తి సాగుకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. కనీసం 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చి, క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,110 పలికితేనే రైతుకు లాభం వస్తుంది. కానీ ప్రస్తుతం పత్తి తడిసి రంగు మారిపోవడం, దిగుబడి తగ్గడం వల్ల రైతులు సగం వరకు మాత్రమే అమ్ముకోగలమేమోనని ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాల లోటు – వ్యాపారుల ఆధిపత్యం
వనపర్తి జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు పత్తి వ్యాపారులు గ్రామాలకే వెళ్లి కాంటాలు వేసి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు వారికే అమ్ముతున్నారు.జిల్లాల వారీ పత్తి సాగుఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు జరుగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ పత్తి సాగు (2.03 లక్షల ఎకరాలు) ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 1.87 లక్షలు, నారాయణపేట జిల్లాలో 1.63 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 82 వేల ఎకరాలు, వనపర్తి జిల్లాలో 15,801 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.





