రాజధాని అమరావతిలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. గతంలో ఇదే ప్రాజెక్ట్‌పై టిడిపి ప్రభుత్వం చర్చించినప్పటికీ, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహ నిర్మాణంపై మరల దృష్టి సారించింది.
ప్రభుత్వం నిర్ణయించినట్లు, మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపై ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. 300 అడుగుల ఎత్తు గల విగ్రహం, 100 అడుగుల ఎత్తులో పాద పీఠంతో నిర్మాణం చేయబడనుంది. పాద పీఠంపై మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం రాజధానిలో ఏ ప్రాంతం నుంచి అయినా కనిపించే విధంగా ఉండనుందని టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రాజధానిలో ఇప్పటికే ఇతర ప్రముఖుల భారీ విగ్రహాల ఏర్పాట్లపై కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. శాఖమూరు సమీపంలో అంబేద్కర్ స్మృతి వనం, పార్క్, లైబ్రరీ వంటి సౌకర్యాలతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, తుళ్లూరు మండలం నెక్కల్లు సమీపంలో పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఇది పొట్టి శ్రీరాములు ట్రస్ట్ పర్యవేక్షణలో జరుగుతోంది.ప్రతీ విగ్రహం ప్రాచీన చరిత్రను తెలుసుకునే అవకాశమే కాక, పర్యాటక ఆకర్షణగా కూడా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. అమరావతి ఇప్పుడు విగ్రహాలు, స్మారకాల వల్ల మరింత దర్శనీయమైన నగరంగా మారుతుంది.





