మహిళలను ఆదిశక్తిగా పూజించే దేశం మనది. ఆడవాళ్లంటే ధన,ధాన్యలక్ష్మి అని కూడా కొలిచే గొప్ప దేశం మన భారత దేశం..పురాణాలు, ఇతిహాసాలన్నింటిలోనూ స్త్రీలకు అత్యున్నత స్థానమే..ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..నాణేనికి మరో వైపు చూస్తే మహిళను మాంసపు ముద్దగా..భోగపు వస్తువుగా చూసే దూరచారం ఒకటుంది..అదే దేవదాసి వ్యవస్థ..ఇంతకీ దేవదాసి వ్యవస్థ అంటే ఏమిటీ..? దేవుడి పేరుతో గ్రామ పెద్దలు దేవదాసీలను ఎలా వాడుకుంటారు..? అనే విషయాలు చెప్పబోతున్నాం..
‘దేవదాసి’ అంటే – గుడిలోని దేవుని ఉత్సవాల్లో నాట్యం చేస్తూ జీవితాంతం అవివాహితగా వేశ్యవృత్తిలో జీవించే స్త్రీ. దీన్ని దాదాపు దేవుడి పేరుతో ఇచ్చే ‘నరబలి’ అని చెప్పవచ్చు..సతీ సహగమనం వంటి దురాచారం ఇది. భారతదేశంలో పూర్వకాలం ఈ ఆచారం వుండేదని చరిత్రకారులు రచించినా..ఇంకా పలు రాష్ట్రాల్లో ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది..అంతే కాదు భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో సైతం ఇలాంటి ఆచారం వుందని తెలుస్తోంది. ఒక స్త్రీని శాశ్వతంగా ఒక దేవాలయానికి, లేక దేవునికి ‘అప్పగించే’ పద్ధతి ఇది..ఆమె కొందరు పూజారులకి, గొప్ప వాణిజ్యవేత్తలకి, రాజులకి ”అందరి సొంతం”గా మారిపోయే విధానం దారుణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఫీసియల్ వ్యభిచారిగా మార్చే పద్ధతి ఇది..దేవదాసిగా మారిన స్త్రీ నిత్య సుమంగళి.

దేవాలయంలో నాట్యకత్తెగా, పరిచారికగా, పండగలు, ఉత్సవాల సమయంలో అందరికీ ఆనందం కలిగేలా నాట్యం చేయడం ఆమె విధి. వారి వారి కొరికెలు తీర్చటానికి ఆమె ఒక మాంసం ముద్ద..దేవదాసీల జీవన విధానానికి జాలిపడి, వారి విముక్తి కొరకు చాలామంది చాలా పోరాటాలే చేశారు…ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తత్పలితంగా ఈ దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి బ్రిటీష్ పాలన నుండే అనేక చట్టాలు కూడా రూపొందాయి. ప్రస్తుతం దేవదాసీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన ”చట్టం” వున్నా కూడా…కొన్ని ప్రాంతాల్లో అనేక పేర్లతో ఈ ఆచారం అయితే కొనసాగుతూనే వుంది. జోగిని, గణిక, విలాసవతి, వంటి పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి..ఈ కఠినమైన ఆచార జీవనంతోను, స్వార్థపరుల అవసరాలకోసం కొందరు స్త్రీలు ఇంకా బలి అవుతూనే వున్నారు.
”మేనంతా మైనపు ముద్దై మరిగిపోతూ, కరిగిపోతూ” వున్న ”దేవదాసి” జీవితం గురించి చెప్పాలంటే వీరి ఆచార వ్యవహారాలు చాలా దారుణంగాఉంటాయి..
మొక్కుబడి పేరుతో దళిత స్త్రీలను దేవతలకు సమర్పించడం అనంతరం జీవితాంతం సమాజం సొత్తుగా, అందరికి ఆనందాన్ని పంచుతూ తాను విషాదంలో జీవితాన్ని గడపటం జోగిని వ్యవస్థలో విషాద అంశం. జోగినిగా మార్చడానికి కుటుంబంకానీ, గ్రామంలోకానీ ఏర్పడ్డ అరిష్టమే ప్రధాన కారణం. గ్రామంలో అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించి దీన్ని ఎదుర్కోడానికి గ్రామంలో నిమ్న కులానికి చెందిన కన్యకు దేవుళ్లతో వివాహం జరిపేవారు. వీరినే జోగినులుగా పిలిచేవారు.

ఈ తంతు ముగిసినప్పటి నుంచి జోగిని నిత్యసుమంగళిగా మారుతుంది. వీరికి వైధవ్యం ఉండదు. జోగిని ఆ గ్రామంలోని అందరి యువకుల సొత్తుగా అంటే పచ్చిగా చెప్పాలంటే ఉంపుడుగత్తె మారిపోతుంది. జోగినిగా మారబోయే అమ్మాయిని పసుపు నీళ్లలో ముంచి, పసుపు చీర కట్టి, తలనిండా పూలు, ఎర్రటి బొట్టుపెట్టి నూతన వధువుగా అలంకరిస్తారు. గ్రామపెద్ద, భూస్వాములుగాని మొదటగా ఆమెతో సంసార ప్రక్రియలో పాల్గొంటారు. దీనినే కన్నెరికం అని వ్యవహరిస్తారు. దీనికిగాను ఆమెకు కానుకలు లభిస్తాయి. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
అంతేకాదు వీరు భూస్వాముల కామాంధకారానికి బలైతూ, ఒక్కోసారి గర్భస్రావాలను కూడా తీపించుకోవాలంటే ఎంత దారుణమో అర్తంచేసుకోవచ్చు..వీరి జీవితంలో ఆఖరి క్షణాల్లో నిర్లక్ష్యానికి గురౌతూ, అందరి అవసరాల కోసం బతికి, చివర్లో ఎవరూ లేని అనాధగా చనిపోయే ఈ దేవదాసి జీవితం చాలా విషాదకరం.

తెలంగాణ సామాజిక వ్యవస్థలో అత్యంత అవమానకర సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు మతం ముసుగులో దళిత స్త్రీల లైంగిక బానిసత్వాన్ని, సామాజిక దోపిడీని ప్రతిబింబిస్తాయి. భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సామాజిక పరిణామక్రమాన్ని పరిశీలిస్తే అనేక సామాజిక దురాచారాలు క్రమక్రమంగా తొలగిపోయాయి. కానీ జోగిని, దేవదాసి వ్యవస్థలు మాత్రం నేటికీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొనసాగుతూనే ఉండటాన్ని బట్టి వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో నేటికీ కనపడటం బాధాకరమైన విషయం. తెలంగాణను చారిత్రకంగా పరిశీలిస్తే భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. దీంతో ఈ దురాచారాలు ఆ కాలంలో చోళ రాజ్యంలో సర్వసాధారణంగా కనపడేవి. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస.

జగన్నాథ దేవాలయంలో వీరిని మహరి అని పిలిచేవారు. దీనికి అర్థం మోహన నారి. అంటే సమ్మోహనానికి మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించే స్త్రీ దేవదాసిగా మారుతుంది. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.జోగిని వ్యవస్థ భూస్వామ్య విధాన అవశేషంగా, మతం, ఆచారం పేరుతో నిమ్న వర్గాలకు చెందిన స్త్రీలను సామాజిక వ్యభిచారం పేరుతో దింపేవారని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 75 శాతం జోగినులు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే ఉండేవారు.
దేవదాసికి ఉండాల్సిన లక్షణాలను పూజారులు నిర్ణయించేవారు.దేవదాసిగా మారిన తర్వాత వీరు వివాహం చేసుకోరాదు.మంగళ, శుక్ర వారాల్లో ఉపవాసం చేయాలి..ఈ రెండు రోజుల్లో 5 ఇళ్లల్లో యాచించాలి..ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు.వాళ్ళ కోరికెలు సైతం తీర్చేలా ఉండాలి..దేవతను పూజించిన తర్వాతనే భోజనం చేయాలి..అబద్ధం ఆడరాదు.ఇలా ఎన్నో కఠినమైన ఆచారాలుంటాయి…దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి బ్రిటిష్ వలస కాలం నుంచి అనేక చట్టాలు రూపొందాయి.సుబ్బరామన్ కృష్ణయ్య యామిని పూర్ణతిలకం, నాగరత్నమ్మ వంటి సంఘసంస్కర్తల సహకారంతో ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాటం ఫలితంగా 1947లో నాటి మద్రాస్ రాష్ట్రంలో దేవదాసి నిషేధ చట్టం రూపొందించింది.1988లో ఈ చట్టాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వర్తించే విధంగా సవరణలు చేశారు.ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థ పూర్తిగా నిషేధం. ఎవరైన ఈ వ్యవస్థను ప్రొత్సహిస్తే వారికి 3 ఏండ్ల జైలు, రూ. 3 వేల జరిమానా విధిస్తారు..





