భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, భారత్-అమెరికా సంబంధాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇరువురు నేతల మధ్య చర్చ భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాలకు కొత్త దిశ చూపనుందనే అంచనాలు ఉన్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.“నా ప్రియ మిత్రుడు మోదీకీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ట్రంప్ ఆప్యాయంగా మాట్లాడారు.ఈ సంభాషణలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రధాన చర్చావిషయాలుగా నిలిచాయి. అంతేకాకుండా, ఇరు నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేశారు.
ట్రంప్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో స్పందిస్తూ..
“నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ మాట్లాడాను. ఆయనకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మద్దతు తన శాంతి ప్రయత్నాలకు ఎంతో ఉపకరిస్తుందని ట్రంప్ పరోక్షంగా సూచించారు.అంతేకాకుండా ఉక్రెయిన్ సంక్షోభం శాంతియుత పరిష్కారానికి అమెరికా చేస్తున్న కృషికి భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.





