హనుమకొండలో శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యులు అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన కిడ్నీ శస్త్రచికిత్సలో విజయాన్ని సాధించారు. ఒకే కిడ్నీలోని 1,820 రాళ్లను తొలగించి రోగికి కొత్త జీవం ప్రసాదించారు.జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలి..కడకంచి పర్షరాములు ఈ నెల 23న తీవ్రమైన కిడ్నీ నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల అనంతరం వైద్యులు అతనిలో డూప్లెక్స్ మొయిటీ (ఒకే కిడ్నీలో ద్వంద మూత్రపిండం) ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి చాలా అరుదైనదని డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
మల్టీట్రాక్ పీసీఎన్ఎల్ పద్ధతిలో శస్త్రచికిత్స:
కిడ్నీలోని అన్ని రాళ్లను తొలగించేందుకు వైద్య బృందం మల్టీట్రాక్ పర్స్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ (PCNL) పద్ధతిని ఎంచుకుంది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట కేసుల్లో రెండు నుంచి మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈసారి ఒకే సిట్టింగ్లో విజయవంతంగా పూర్తి చేశారు.

ఆరోగ్యశ్రీ కింద ఉచిత సర్జరీ చేసి 72 గంటల్లో డిశ్చార్జ్..!
హైదరాబాద్, హనుమకొండ నగరాల్లోని అనేక ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్ కోసం రూ.3.5 లక్షలకుపైగా ఖర్చవుతుందని రోగికి ముందుగా తెలిపారు. అయితే శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు.అనంతరం కేవలం 72 గంటల్లోపే పర్షరాములు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రోగి కుటుంబ సభ్యులు వైద్యుల సేవలను అభినందించారు.విజయవంతమైన శస్త్రచికిత్సతో డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి బృందం వైద్య రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఒకే కిడ్నీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రాళ్ల తొలగింపు అరుదైన రికార్డు స్థాయిలో ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.





